Akbar & Birbal Stories in Telugu
1. అక్బర్ – బీర్బల్ పరిచయం | Akbar & Birbal Stories in Telugu
Akbar & Birbal Stories in Telugu
భారతదేశాన్ని పరిపాలించిన మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. మతసామరస్యంలో అక్బరచక్రవర్తి చరిత్ర చాలా గొప్పది.
అక్బరు పుట్టినప్పుడు, తండ్రి హుమయూన్ రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఉన్నాడు. 1542 లో హుమయూన్ చక్రవర్తి తన కుమారుడు అక్బరు జన్మించిన సందర్భంలో తన వద్దవున్న సుగంధద్రవ్య కస్తూరిని తన వారందరికి పంచిపెట్టాడు.
తన కుమారుని కీర్తి ప్రతిష్టలు కస్తూరి సువాసనలువలె దేశమంతటా వ్యాపించాలని ఆశించాడు. తండ్రి ఆశించినట్లే అక్బరు దేశంలో మంచిపేరును పొందాడు.
అక్బరు మంచి సామరస్యము కలిగినవ్యక్తి, హాస్యప్రియుడు. అతని దర్బారు ప్రతిరోజు పండితులతో, కవులతో – సామంతులతో, ఉద్యోగులతో ఎంతో వేడుకగా సమర్థవంతంగా ఉండేది.
సమయస్ఫూర్తి, యుక్తి – వినోదము అందించడంలో – అక్బరు దర్భారులో బీర్బల్ మంచి చతురుడు. అతనివలన అక్బరు కీర్తి దేశదేశాల వ్యాపించింది.
బీర్బల్ సాధారణ కుటుంబములో పుట్టాడు – చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. దగ్గర బంధువులు చేరదీసి పోషించారు.
పసితనంనుండే బీర్బల్ విద్యాబుద్ధులందు మంచి వివేకము. ఉత్సాహము. చాతుర్యము ప్రదర్శిస్తుండేవాడు. అందరితో పొత్తుగా, వినయముగా మృధువుగా, మాట్లాడుతుండేవాడు.
ఈ మంచిగుణములు వల్ల బీర్బల్ ఎదుటి వారికి వినోదము కలిగేలా మాట్లాడేవాడు. మంచి సమయస్ఫూర్తి పసితనం నుండే అబ్బింది. ఎదుటవారితో యుక్తిగా మాట్లాడి వారిని మెప్పించేవాడు.
మహామేధావియైన బీర్బల్ వివేక విద్యాసంపన్నుడై ఉన్నప్పటికి దరిద్రముతో చాలా బాధపడుతుండేవాడు. గ్రామములోని పెద్దలు అతనిని అక్బరు వద్దకు వెళ్ళి ఆశ్రయించ మని ప్రోత్సహించేవారు.
బీర్బల్ ఢిల్లీకి బయలుదేరి అక్బరుకోటకు వెళ్ళాడు. రాజభటులు అతనిని కోటలోనికి వెళ్ళనియ్యలేదు. తిరిగి తిరిగి ఒకనాడు కొన్ని గుడ్డలను పెద్దమూటగా కట్టుకొని కోట ముందుకు వెళ్ళాడు.
“ఓయీ! కట్టుగుడ్డయినా లేని నిన్ను లోనికి పంపించం” అన్నారు భటులు. “అయ్యలారా! ఆగ్రహించకండి. నేను నిరుపేదనే కాని రాజుగారికి మేలు చేయగల విషయమొకటి చెప్పవలెనని వచ్చితిని.
మీరులోనికి పంపించినచో ప్రభుదర్శనం చేసుకుని విషయం చెప్పి వారి మెప్పును పొందగలవాడను. మెచ్చుకున్న ప్రభువులు నాకిచ్చు పారితోషికములో సగము మీకిచ్చెదను.
నన్ను లోనికి అనుమతించండి” అని వేడుకున్నాడు. “సరే” అని భటులు బీర్బల్‌ని లోనికి వదిలిపెట్టారు. కొంతదూరం వెళ్ళగా రెండవ దర్వాజా వద్ద భటులు వానిని అడ్డగించారు.
“తనకు వచ్చే బహుమతిలో సగం మొదటి దర్వాజావారికిస్తానని వాగ్దానంచేసాను. మిగిలిన దానిలో సగభాగం మీకు ఇచ్చుకుంటాను” అని బ్రతిమలాడి బీర్బల్ ఆ ద్వారం దాటి మరికొంత దూరంలో ఉన్న మూడవ ద్వారానికి చేరుకున్నాడు.
వాళ్ళుకూడా బీర్బల్‌ను అడ్డుకున్నారు. వారికి విషయం చెప్పి “మిగిలిన నాల్గవవంతు పారితోషికం మీకు ఇస్తాను” అని ఆ మూడవద్వారం వద్ద గల భటులకు వాగ్దానం చేసి పాదుషావారి దర్బారులోనికి ప్రవేశించాడు.
అక్కడి భటులు వానిని అవతలకు గెంటి వేయబోయారు. అక్బరు ఆ అలికిడి విని, అతని వాలకాన్ని చూచి చిరాకు పడి “వందకొరడాదెబ్బలు కొట్టి వానిని అవతలకు తరిమివేయ” మని ఆజ్ఞాపించాడు.
భటులు వానిని కొరడాలతో కొట్టబోగా “అయ్యలారా! కంగారుపడకండి. పాదుషావారు నాకు ఇచ్చే దానిలో సగం మొదటి దర్వాజావారికి మిగిలిన దానిలో సగము రెండవ దర్వాజావద్ద ఉన్నవారికి, మిగిలిన దానిని మూడవదర్వాజావారికి పంచి నన్ను మాట నిలబెట్టుకో నివ్వండి” అని వేడుకున్నాడు.
పరిస్థితిని, విషయాన్ని, తెలియజెప్పిన బీర్బల్ విజ్ఞతను గమనించిన అక్బరు వానిని మన్నించి, నౌకరులను శిక్షించి బీర్బల్‌కు తన ఆస్ధానంలో స్వేచ్ఛగా వచ్చేపోయే అనుమతిని ఇచ్చాడు.
కాలం గడుస్తూ ఉంది. బీర్బల్ తరుచుగా పాదుషా వారి దర్శనం చేసుకుంటుండేవాడు. అక్బర్ పాదుషావారికి తమచిత్రపటాన్ని చిత్రీకరింపజెయ్యాలన్నా ఆసక్తి కలిగింది.
ఒకనాడు దర్బారులో తమ అభిలాషను ప్రకటించారు. యధాతధంగా తమ చిత్రాన్ని వేసిన ఉత్తమ చిత్రకారునికి వెయ్యి బంగారు నాణేలు ఇస్తామని చిత్రాన్ని నెల రోజుల తర్వాత ఫలానా తేదీనాడు దర్బారుకు తెచ్చి తమకు సమర్పించాలని ప్రకటించారు పాదుషా.
దేశంలోగల చిత్రకారులంతా తమతమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్బరు వారి చిత్రాన్ని చిత్రీకరించారు. నిర్ణీత రోజున చిత్రకారులంతా తాము చిత్రీకరించిన చిత్రాలను పాదుషావారికి చూపించారు.
ఏ ఒక్కరువేసిన చిత్రం ప్రభువుల మనస్సును మెప్పించలేదు. ఆ వరుసలో బీర్బల్ ముందుకువచ్చి “జహాపన! దీనిని చిత్తగించండి. ముమ్మూర్తులా మీకు సాటిగా ఉంటుందని” గుడ్డతో చుట్టబెట్టిన దానిని ప్రభువు ముందుంచాడు.
బీర్బల్ నీకు చిత్రలేఖనం కూడ వచ్చునా? నీవు వీరివలనే అంతమాత్రంగా చిత్రీకరించేవా?” అని ప్రశ్నించి ఏది చూపించమన్నారు అక్బర్‌పాదుషా.
బీర్బల్ నిలువుటద్దాన్ని అక్బరాదుషా ముందుంచేడు. “చూడండి ప్రభూ! కొంచెంకూడా తేడా ఉండదన్నాడు. అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి బీర్బల్ ఆంతర్యాన్ని గ్రహించాడు.
దేవుని సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యపడే విషయం కాదు. ఎంతటి పనివాడికైనా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ విషయం తెలిసొచ్చేలా చేసిన బీర్బలను అభినందించిన మొగలాయి చక్రవర్తి అక్బర్, ఆతడిని తన దర్బార్ విదూషకుడుగా నియమించుకున్నాడు.
2. నక్షత్రాల లెక్క | Akbar & Birbal Stories in Telugu
అక్బర్ ఒకనాడు ఆరుబయటగల తన పాన్పుపై వెల్లకిలా పడుకున్నాడు. ఆకాశంలో గల నక్షత్రాలు మిలమిలలాడుతూ ఆయన హృదయాన్ని పరవశింపచేసేయి. ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన
కలిగింది. ఆలోచించి ఆలోచించి ఆ మర్నాడు దర్బారులో మింటగల చుక్కలు లెక్క చెప్పగలవారికి రత్నాలు, రాసులు బహుమానం ఇస్తామని ప్రకటించాడు.
ఎవరికి ఎంతమాత్రం సాధ్యంగాని ఈ లెక్కకు చాలామంది నిరాశచెందారు. నక్షత్రాల లెక్క చెప్పవలసిన రోజున అద్భుతమైన ఈనక్షత్రాల లెక్క ఎన్నికోట్లో తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేకమంది దర్బారుకు చేరుకున్నారు.
బీర్బల్ మాత్రం రాలేదు. అతని రాకకై ఎదురు చూడగా చూడగా కొంతసేపటికి, ఒకమూటను పట్టుకొని దర్బారుకు వచ్చి, మూటను సభామధ్యంలో ఉంచాడు. “ప్రభువులు క్షమించాలి.
నక్షత్రాలు లెక్కపెట్టడం పూర్తయ్యేసరికి ఆలస్యమయింది.” అన్నాడు బీర్బల్. “ఏమిటి? నక్షత్రాలను లెక్కపెట్టావా” అనిఅడిగాడు అక్బరాదుషా.
చిత్తం, లెక్క ఇన్ని అనిచెప్పడం అంకెల్లో సాధ్యపడనందువల్ల నక్షత్రానికొక ఆవగింజవంతున లెక్కపెట్టి ఆ ఆవాలను ఈ సంచిలో వేయించి ఇక్కడకు తెచ్చాను.
గణికులను నియోగించి ఆవాలు లెక్కపెట్టించండి. అవి ఎన్ని ఉంటే అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయన్నాడు”. సాధ్యంకాని పనిని అది అసాధ్యమని యుక్తిగా చెప్పిన బీర్బలయుక్తికి, సముచిత ఆలోచనకు ముగ్ధుడైన అక్బర్ – ఆనాటినుండి బీర్బల్‌ను తన ఆంతరంగిక విదూషకునిగా నియమించాడు.
3. అరచేతిలో వెంట్రుకలు
Akbar & Birbal Stories in Telugu
కాలం గడచిపోతున్నది. అక్బర్ – బీర్బల్లల సాన్నిహిత్యం మరింతగా పెరిగింది. బీర్బల్ సమయోచిత విజ్ఞానానికి, సామరస్య పూర్వకమైన విధానానికి అక్బర్ ఎంతగానో సంతృప్తి చెందుతుండేవాడు.
ఒకనాడు పాదుషావారికి బీర్బల్తో హాస్యమాడాలనిపించింది. నిండు సభలో బీర్బల్‌ను ఉద్దేశించి “బీర్బల్ మాకొక సందేహం అది నువ్వే తీర్చగలవని నా విశ్వాసం” అన్నాడు.
“ప్రభువులకు సందేహమా, అది ఈ సామాన్య విదూషకుడు తీర్చడమా? అదేమిటో శలవియ్యండి జహాపనా. నాకు తోచిన మేరకు మీ సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తా” నన్నాడు.
మరేంలేదు. మనందరకు తెలుసున్న విషయమే అది ఎందువల్ల జరుగుతున్నది తెలియక నిన్నడుగుతున్నాను. అన్న పాదుషాను విషయం తెలియజెప్పవలసిందని అడిగాడు బీర్బల్.
ఏమున్నది. మన శరీరము అంతటా వెంట్రుకలు కొంతగాక కొంతయినా ఉన్నాయి. కాని నా అరచేతుల్లో ఎందువల్ల వెంట్రుకలు లేవన్నది మా సంశయము అన్నాడు.
“ఏమున్నది ప్రభూ! మీరుచేసే దానధర్మాల వల్ల తమ అరచేతులలో వెంట్రుకలు మొలవడం లేదు”అన్నాడు. యుక్తీయుక్తమైన జవాబుకు ఆనందించిన అక్బరుకు బీర్బల్న తికమక పెట్టాలనిపించి “మరి నీ అరచేతిలో ఎందుకు మొలవలేదని” ప్రశ్నించాడు.
“ఏమున్నది ప్రభూ మీరిచ్చే కానుకలు, ధర్మాలు అందుకోవడంలో అరచేతులు అరిగిపోయి వెంట్రుకలు మొలవడం వీలుగాక అట్లాగే ఉండిపోయా” యన్నాడు. ఆ సమాధానాలకు పాదుషా – సభికులు ఎంతగానో ఆనందించి బీర్బల్ జ్ఞానాన్ని ఎంతగానో ప్రశంశించారు.
4. మామిడిపళ్ళ విందు
Akbar & Birbal Stories in Telugu
అక్బర్ గారి అంతఃపురానికి స్వేచ్ఛగా వచ్చీపోయే సాన్నిహిత్యం బీర్బల్‌కు ఉండేది. యధాప్రకారం ఒకనాడు బీర్బల్ అంతఃపురానికి రాబోయేసరికి అక్బరాదుషా మామిడిపళ్ళను ఆరగిస్తున్నారు.
వచ్చిన బీర్బలు అప్యాయంగా ఆహ్వానిస్తూ అక్బర్వారు “రావయ్యా బీర్బల్! మంచి సమయానికి వచ్చావు. మామిడిపళ్ళు మంచి పసందుగా ఉన్నాయి.
కూర్చో తిందువుగాని” అన్నారు. అసలే మామిడిపళ్ళు, మంచిరుచిగా ఉన్నాయని ప్రభువు అంటున్నారు. తనకు కూడా వాటిపట్ల మోజు కలిగింది బీర్బల్‌కు.
చాలా ఇద్దరు కూర్చుని పళ్ళను ఆరగిస్తున్నారు. అక్బర్ పాదుషావారు పళ్ళరసాన్ని పీల్చి టెంకలను బీర్బల్ ముందున్న టెంకలలో పడవేయసాగారు.
మరికొంతసేపటికి “యేమయ్యా బీర్బల్ అంత ఆకలితో ఉన్నావా ఎక్కువ కాయలు తిన్నట్టున్నావు” అని బీర్బల్ ముందున్న టెంకలను చూపించి చమత్కరించారు. “ప్రభూ! నేను ఆకలితో ఉన్న మాట వాస్తవం. అదీగాక
పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. నేనుకాస్త అతిగానే పళ్ళను ఆరగించానన్నాడు. మరికొన్ని పళ్ళు తిను” అన్నాడు అక్బరాదుషా. ప్రభూ నాకు కడుపునిండిపోయింది.
భ్రాంతి తీరిపోయింది. ఇంక ఒక్కపండును కూడా పీల్చలేను. కాని తమరు నాకన్నా ఆకలితో ఉన్నట్టున్నారు. నేను టెంకలనయినా వదిలి వేసాను.
తమరు ఒక్క టెంకనుకూడా వదలకుండా టెంకలను సైతం ఆరగించారు. ఆకలితో ఉన్నట్టున్నారు తమరే నాలుగుపళ్ళు తినండి” అని చమత్కరించాడు బీర్బల్.
బీర్బల్ చమత్కారానికి ఆనందించి, తానుతిన్న పళ్ళెంలోని టెంకలను బీర్బల్ విస్తరిలో పడవేసినందుకు సిగ్గుపడ్డాడు. తన అవివేకాన్ని సున్నితంగా దుయ్యబట్టిన బీర్బల్‌ను అభినందిచాడు.
5. అబద్దంయొక్క బలం
Akbar & Birbal Stories in Telugu
ఒకానొకప్పుడు అక్బరుపాదుషా వారి దర్బారునందు రాజకీయ వ్యవహారములు మీమాంసలు – నిర్ణయాలు ముగిసిన తరువాతను – సభలో వినోద ప్రసంగాలు చోటు చేసుకున్నాయి.
క్రమక్రమంగా సభాసదుల ప్రసంగాలు, నిజం అబద్ధం ఏది బలమైనట్టిది అన్న. మీమాంసకు చేరుకున్నది. వాద ప్రతివాదాల అనంతరం నిజమే బలమైనది, స్థిరమైనది అని నిర్ధారణకొచ్చారు.
బీర్బల్ మాత్రం అబద్దమే బలమైనది అని వాదించేడు. – అక్బరుపాదుషావారు నిరూపించమన్నారు. సమయాన్ని అనుమతిస్తే అబద్దం ఎంత బలమైనదో నిరూపిస్తానన్నాడు.
ఆరుమాసాలు గడువిస్తున్నాను. నిరూపించు లేదంటే సభవారి నిర్ణయానికి విరుద్ధంగా నిర్ణయించిన నీకు శిరచ్చేదమై శిక్ష అన్నారు. “చిత్తం” అని అంగీకరించాడు బీర్బల్.
కాలం గడచిపోతున్నది. ప్రజలు, పాదుషావారు ఆ విషయాన్నే మర్చిపోయారు. ఒకనాడు ఒక వృద్ధ వేశ్య మనవరాలితో రాజుగారి దర్శనానికి వచ్చింది. పాదుషావారు నా మనవిని చిత్తగించి, మీ చిత్తాన్ని నేను చెప్పే విషయం మీద మీ
కేంద్రీకరించాలి. మీకు గొప్ప మేలు కలుగుతుంది. ఈ నా మనమరాలు ఇటీవలనే పుష్పవతి అయ్యింది. పేరంటము, ఆశీస్సులు పూర్తయిన నాటి రాత్రి దేవేంద్రుడు నాకు కలలో అగుపించి, హే, హేమాంగీ నీమనువరాలు నాకొరకై పుట్టింది.
నేను ఈ నాటికి 3 నెలల అనంతరం ఆమెను ఏలుకొనుటకు వస్తున్నాను. పాదుషావారి దర్శనం చేసుకుని ఏకాంత మందిరం ఏర్పాటుచెయ్యమని కోరుకుని, నీ మనవరాలిని అందుంచి నా రాకకై నిరీక్షించు.
పరులెవ్వరి ప్రాపకానికి ఆమెను వినియోగించకు. మూడునెలలనాటికి శ్రావణమాసం వస్తున్నది. ఆ మాసంలోని పూర్ణిమరోజు అర్ధరాత్రి ఏకాంతర మందిరానికి నేను వస్తాను.
ఇందుకు యే విధమైన మార్పు ఉండబోదు. అని నన్ను హెచ్చరించాడు. ఆ విషయం తమకు మనవి చేసుకుని ఏకాంతర మందిరం ఏర్పాటు చేయగలందులకు వేడుకుంటున్నాను అన్నది.
ఇంతకుముందెన్నడు యేనాడు జరగని విశేషం ఇది. మానవకాంతను దేవేంద్రుడు ఆశించడం ఆమెకొరకు తాను భువికి ఫలానారోజున వస్తాననడం అబ్బురంగా ఉన్నది.
నిరీక్షిస్తే నిజానిజాలు తెలుస్తాయని పాదుషావారు యోచించి ఆమెకోరిన ప్రకారం ఆమె కుమార్తెకు ఏకాంతరమందిరం కట్టించి, ఆ ఇచ్చిన భవనంలో తన కుమార్తెను ప్రవేశపెట్టి పాదుషావారిని రాజధాని ప్రముఖులను,
శ్రావణశుద్ధ సప్తమీ శనివారంనాడు జరుగబోయె తనకుమార్తె కన్నెరికపు మహోత్సవానికి వచ్చి, దేవేంద్రుల వారి దర్శనం చేసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదని ఆహ్వానించింది.
కాలంగడచింది. శ్రావణ శుద్ధపౌర్ణమి శనివారం అర్ధరాత్రి దేవేంద్ర ఆగమన సందర్శనాభిలాషులై పాదుషా వారు ప్రముఖులు కన్నార్పకుండా నిరీక్షిస్తూన్నారు. దేవేంద్రుడు రావడంగాని, మరేవిధమైన విశేషంగాని జరగలేదు.
అక్బరుకు కోపం వచ్చింది. భటులను పంపించి, నిద్రపోతున్న వేశ్యను ఆమె మనవరాలిని దర్బారుకు రప్పించాడు. ఇంతటి అబద్దమా – మమ్మల్నే మోసగించడమా అని ప్రశ్నించాడు. పాదుషావారు అనుగ్రహించాలి మిమ్మల్ని
మోసగించడానికి నేనీ అబద్దం చెప్పలేదు. అబద్దం యొక్క బలం నిరూపించమని తమరు బీర్బల్ గారిని ఆదేశించారు.
అది ఋజువు చేయడానికే బీర్బల్ గారు చేసిన పన్నాగమిది. అన్నీ తెలిసిన తమరే అబద్దాన్ని నమ్మారు. దాని శక్తికి దాసులయ్యేరు.
మరి నిజం కన్నా అబద్దం బలంకలిగినట్టిదని నిరూపించడమె మాయీ పన్నాగం అని పలికింది. నిజం అబద్ధానికికున్న బలం సామాన్యమైనది కాదు.
అది ఎప్పుడైనా – ఎక్కడయినా – ఎవర్నయినా నమ్మించి విస్తరించగల ‘బలము కలిగినట్టిదన్న సత్యాన్ని గుర్తించి అక్బర్ పాదుషావారు వేశ్యను బీర్బల్ ను సత్కరించారు.